ద‌టీజ్ కేసీఆర్‌… దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ సీఎం

-

మిష‌న్ భ‌గీర‌థ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌క్సెస్ అయ్యింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష్యం ఫ‌లించింది. వేలాది గ్రామాల‌కు సుర‌క్షిత‌, గోదావ‌రి నీళ్లు గ‌డ‌గ‌డ‌ప‌కు చేరుకుంటున్నాయి. తెలంగాణ మహిళలను నీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాగునీటి కోసం గ్రామీణులు ముఖ్యంగా మహిళలు కష్టపడుతూ ఉపాధి అవకాశాలు కోల్పోతుండడమే కాకుండా ఆరక్షిత నీటితో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సులభంగా తెలంగాణలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించే విధంగా వాటర్‌గ్రిడ్‌ (మిషన్‌ భగీరథ) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం దాదాపు  ఐదేళ్ల‌ క్రితం చేపట్టింది.

తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ. కె.చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్‌ భగీరథను చేపట్టారు. అంతర్జాతీయ పోటీ పద్ధతిలో నిర్వహించిన టెండర్లలో పలు ప్యాకేజీలను ఏంఈఐఎల్‌ దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాల్లో (గతంలోని తొమ్మిది గ్రామీణ జిల్లాల్లో) రక్షిత తాగునీరు అందించే ఉద్దేశ్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు దాదాపుగా పూర్త‌య్యాయి. 10శాతం మిగిలిపోయిన ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర జలవనరులశాఖ స్వయంగా తెలియజేసింది.

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 98.29 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్స్ ద్వారా తాగునీరు అందిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణకు దరిదాపుల్లో ఇతర రాష్ట్రాలు లేని విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవాలో 89.05 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఎక్కువ నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో పుదుచ్చేరి, హరియాణా, గుజరాత్ టాప్ 5 లిస్టులో ఉన్నాయి. ఇక 34.62 శాతం నల్లా కనెక్షన్లతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉండగా.. మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చివరి స్థానాల్లో నిలిచాయి.స్వయంగా కేంద్ర మంత్రిత్వశాఖ ఈ మేరకు ప్రకటించడంతో ఈ విషయ మీద ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు ఈ ప‌థ‌కం నిద‌ర్శ‌న‌మ‌ని విప‌క్షాలు సైతం కొనియాడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news