దేశంలో రాబోయేది రైతుల సర్కార్ : పెద్దపల్లి సభలో కేసీఆర్

-

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోయి రైతుల సర్కార్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ సమీకృత భవనాలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించామని కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి ఉద్యమంలో అనేకసార్లు జెండా ఎగురవేశానని తెలిపారు.

సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని కేసీఆర్ తెలిపారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామని వెల్లడించారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు.ఇటీవల జాతీయ రైతు నాయకులు తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారని చెప్పారు. గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను కేంద్రం దగా చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అడ్డగోలుగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారని విమర్శించారు. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని అన్నారు. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news