జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరీక్షలను కనీసం 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.వెంకటేశ్‌తోపాటు హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, జనగామ, కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సిట్‌లను చేర్చారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టనున్నారు. సాధారణంగా గ్రూపు-1, 2, 3, 4 పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా నిర్వహించాల్సి ఉందని.. ఈ మేరకు ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.