తెలంగాణలో త్వరలోనే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుదల దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి ప్రాంతాల వారీగా ఈ నెల 18వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా వారు భూముల మార్కెట్ విలువల సవరణపై ప్రాథమిక అంచనాలను శాఖ ప్రధాన కార్యాలయంలో అందజేశారు.
2021 నాటి సవరణ అనంతరం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకుని రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని సమాచారం. ఉదాహరణకు హైదరాబాద్ పరిసర జిల్లాలైన మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో పెంపు కనీసం 40 శాతం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. మండల, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువల పెంపు 20 శాతం వరకు ఉండే అవకాశాలున్నాయి.