తాగునీటికి సంబంధించి 10 టీఎంసీలు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. సెప్టెంబర్ నెల వరకు తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేయాలని బోర్డును కోరింది. ఈమేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రతిపాదనలు పంపింది.
తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా ఐదు టీఎంసీల నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా బోర్డును కోరిన విషయం తెలిసిందే. ఆ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ హాజరు కాలేదు. పది టీఎంసీలు తమకు కావాలని బుధవారం బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మిషన్ భగీరథకు నాలుగున్నర, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఐదున్నర టీఎంసీలు కావాలని కోరారు. రెండు రాష్ట్రాల నుంచి 15 టీఎంసీలకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలన్న విషయమై కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి… ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తారని సమాచారం.