- తెలంగాణ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ః రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా త్యరలోనే మరో కొత్త ఐటీ పాలసీని తీసుకురానున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తాజాగా ఆయన ఐటీ శాఖ విభాగధిపతులతో ఐటీ పాలసీపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన అనంతరం తీసుకువచ్చిన ఐటీ పాలసీ త్వరలోనే ఐదేండ్లు పూర్తి కానున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇదివరకూ తీసుకువచ్చిన ఐటీ పాలసీ.. రాష్ట్ర ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా వుందనీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అధికం చేయడంలో ఎంతగానో దోహదం చేసిందని కేటీఆర్ వివరించారు.
ఇక త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం కోసం కొత్త ఐటీ పాలసీని తీసుకువస్తామని తెలిపారు. కొత్త పాలసీకి సంబంధిచిన ఆయా అధికారులకు కేటీఆర్ మార్గనిర్ధేశం చేశారు. ఐటీలో రానున్న రోజుల్లో అధికమొత్తంలో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు ఐటీ ద్వారా పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే టీ ఫైబర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యర్థులను ఆవిష్కరణకర్తలుగా మార్చే అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఐటీ విభాగం నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.