Telangana : ఈ వారమంతా ఈదురుగాలులు.. వర్షాలు

-

గత రెండ్రోజులుగా తెలంగాణ కాస్త చల్లబడింది. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. గత రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

వాతావరణ అధికారుల సూచనతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా అకాల వర్షాలు పడుతుండటంతో పంటంతా నాశనమైపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే నీటిపాలవుతున్న పంటను చూసి తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఈ ఏడాది తమ కష్టం నీటిపాలైనట్లేనని బాధపడుతున్నారు.

మరోవైపు సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news