ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందంటూ రాజ్యాసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భువనగిరిలో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బునంతా గ్యారెంటీలు, ఉచితాల పేరుతో ప్రభుత్వం వృథా చేస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇక్కడే, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం ఏమిటో ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి జఠిలమైన సమస్యలను కూడా ఎంతో సమస్ఫూర్తిలతో క్లియర్ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడం ఖాయమని లక్ష్మణ్ అన్నారు.