రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. టిడిపి పార్టీ నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.
ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచారని.. కెసిఆర్ కి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ఆయన కొనసాగించారని తప్పుపట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తమ ఫిర్యాదు పై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.