ఇది మోడీ ప్రభుత్వం కాదు.. AD ప్రభుత్వం – కేటీఆర్

పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరని అన్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందని.. మిత్రులారా గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. ద్వేషం కాదు దేశం ముఖ్యం అన్నారు కేటీఆర్. ఉద్వేగాల భారతం కాదు..ఉద్యోగాల భారతం ముఖ్యమన్నారు. ఇది మోడీ ప్రభుత్వం కాదు, AD( Attention Diversion ) ప్రభుత్వమని అన్నారు.

దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర.. ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర, ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతోందన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం… అనేది బీజేపీ అందమైన నినాదం కానీ విద్వేశం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం అంటూ ఎద్దేవా చేశారు.