ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనక వెళ్తున్న కారు లారీ వెనక భాగాన్ని ఢీ కొట్టింది. అదే సమయంలో వెనకాల వస్తున్న మరో లారీ కారును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులైన రాజేశ్‌, సుజాత దంపతులు, వారి కుమారుడు ఆశ్రిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.