సికింద్రాబాద్ ఘటన.. ముగ్గురి ఆచూకీ గల్లంతుపై అనుమానాలు

-

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆచూకీ గల్లంతుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆచూకీ లేని ముగ్గురు బిహార్‌ కూలీల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. మిస్ అయిన జునైద్, వసీం, అక్తర్ కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు. కాలిపోయిన భవనంలోనే ఈ ముగ్గురి సెల్‌ సిగ్నల్‌ చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భవనం లోపలే ఉంటే మృతదేహాలు కాలి బూడిదై ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు

అగ్నిప్రమాద భవనంలో దాదాపు 12 గంటల పాటు అగ్నికీలలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న భవనం లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆచూకీ లేని ముగ్గురు బిహారీల కోసం క్రేన్ సాయంతో పోలీసులు గాలించనున్నారు. గాలింపు తర్వాత భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మృతదేహాల ఆనవాళ్లు కనిపిస్తే బయటకు తీస్తామని చెబుతున్నారు.

మరోవైపు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో కొంత మంది దట్టమైన పొగవల్ల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఏడీఎఫ్​వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లిద్దరిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నర్సింగ రావుకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news