తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ, ఉత్పత్తి సంస్థ(ట్రాన్స్కో, జెన్కో)ల్లో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే నిబంధనలకు లోబడి నోటిఫికేషన్ జారీ చేసి, డైరెక్టర్ల నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీలకు తాజాగా ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థల్లో 11 మంది డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఆయా పదవుల్లో కొనసాగుతున్నారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
సాధారణంగా ఈ సంస్థల్లో డైరెక్టర్లను రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తారు. తరువాత అత్యవసరమైతే వారి సేవల్ని ఏడాది చొప్పున గరిష్ఠంగా రెండేళ్లు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తారు. అంటే డైరెక్టర్‌గా ఆ పోస్టులో మొత్తం నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదన్న మాట. కానీ గత ప్రభుత్వం కొందరు డైరెక్టర్లను నియమించి, వారి పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అంటూ పొడిగిస్తూనే వచ్చింది. ఇలా ట్రాన్స్‌కోలో ఐదుగురు, జెన్‌కోలో ఆరుగురు డైరెక్టర్లుగా కొనసాగుతుండగా.. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బోర్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించి కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.