దుబ్బాక కాంగ్రెస్ అభ్య‌ర్థిలో అదిరే ట్విస్ట్‌… గులాబీకి గుబులు స్టార్ట్‌…!

-

తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థిని దాదాపుగా ప్ర‌క‌టించిన‌ట్టే. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్య‌క్షుడు టి. న‌ర్సారెడ్డి పేరును ఖ‌రారు చేసింది. ఆయ‌న గ‌తంలో గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ ఇక్క‌డ ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని భావిస్తోంది.

ఇక ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ కీల‌క నేత ర‌ఘునంద‌న్ రావు పేరు ఖ‌రారు కావ‌డంతో ఆయ‌న గ‌త నెల రోజులుగా ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక‌పై ఆదివారం గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన రాష్ట్ర స్థాయి స‌మావేశంలో పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో పాటు ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు చెందిన ప‌లువురు కీల‌క నేతలు పాల్గొన్నారు. దామోదర రాజ నర్సింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేశ్‌ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, దుబ్బాక సమన్వయకర్త నగేశ్‌ ముదిరాజ్‌లు పాల్గొన్న ఈ స‌మావేశంలో ఎవ‌రిని అభ్య‌ర్థిగా ఎంపిక చేయాల‌న్న విష‌యంపై పెద్ద చ‌ర్చే న‌డిచింది.

చివ‌ర‌కు ఎక్కువ మంది న‌ర్సారెడ్డికే ఓటు వేయ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న పేరును ఖ‌రారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన దుబ్బాక కాంగ్రెస్ అభ్య‌ర్థిగా న‌ర్సారెడ్డి పేరును అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ఏడు మండ‌లాల‌కు క‌లిపి మొత్తం 147 మంది ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించింది. రంతా ఈ నెల 7వ తేదీ నుంచి నియోజకవర్గంలో ఉండి ప‌ని చేయాల‌ని టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ రెడ్డి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉండ‌డంతో కాంగ్రెస్ అదే వ‌ర్గానికి చెందిన న‌ర్సారెడ్డిని రంగంలోకి దింప‌డం.. మ‌రో వైపు వెల‌మ వ‌ర్గానికి చెందిన ర‌ఘునంద‌న్ బీజేపీ నుంచి బ‌రిలో ఉండ‌డంతో ఈ సారి గులాబీలో గుబులు స్టార్ట్ అయ్యింద‌నే అంటున్నారు. ఈ సారి దుబ్బాక‌లో అధికార పార్టీపై వ్య‌తిరేక‌త‌, ర‌ఘునంద‌న్‌పై సానుభూతి, క్యాస్ట్ ఈక్వేష‌న్లు, మృతిచెందిన రామ‌లింగారెడ్డి త‌న‌యుడు శ్రీనివాస్‌రెడ్డిపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు, మ‌రో మాజీ మంత్రి ముత్యంరెడ్డి వ‌ర్గం స‌పోర్ట్ ఇవ‌న్నీ కీల‌కం కానుండ‌డంతో గులాబీ పార్టీలో గుబులు మొద‌లైంది.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news