తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయని అన్నారు. నిజామాబాద్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా తెలంగాణ పర్యటకు వస్తారని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుందని చెప్పారు. రానున్న నెల రోజుల్లో పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్దం కావాలని పిలునిచ్చారు. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను పూర్తిగా ఉధృతం చేయాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పర్యటిస్తారని చెప్పారు. లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని.. ఖమ్మంలో కూడా బీజేపీ బలంగా ఉందని తెలిపారు. తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రతిపాదనలపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నిర్ణయం సరైనదేనని చెప్పారు. అనర్హులకు పదవులు ఇవ్వాలని అనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఏమైనా కేటీఆర్ జాగిరా? అని ప్రశ్నించారు. 17 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం సర్టిఫికేట్ తనకు అవసరం లేదన్నారు. తనకు తెలంగాణ ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారని.. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిపించారని చెప్పారు.