తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించడం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. దీంతో గవర్నర్‌ను టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవా? అని గవర్నర్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ఆమె గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారని గుర్తు చేశారు. ఆమె సరిగ్గా ఆలోచించి ఉంటే తిరస్కరించకపోయి ఉండేవారన్నారు కేటీఆర్. ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తాము నామినేట్ చేశామన్నారు కేటీఆర్.
సామాజిక కార్యక్రమాలు లేవంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. గవర్నర్ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరిని నామినేట్ చేయాలనేది తమ ఇష్టమన్నారు. అసలు దేశానికి గవర్నర్ వంటి పోస్టులు అవసరమా? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. గవర్నర్ కు పై నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ని, జ్యోతిరాదిత్య సింధియా తదితరులను రాజ్యసభకు ఎలా పంపించారో చెప్పాలన్నారు. కర్ణాటకలో మంత్రిగా పని చేసిన మహిళను ఎమ్మెల్సీగా చేశారని చెప్పారు. ఇలా ఒక్కరిని కాదు… ఎంతోమందిని పెద్దల సభకు పంపించారన్నారు. అందరు అర్జున అవార్డు గ్రహీతలకు ఇవ్వాలంటే మీ రాష్ట్రంలో ఎందరికి ఇచ్చారో చెప్పాలన్నారు. గవర్నర్ కు మరోసారి ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ పంపిస్తామన్నారు. మేడమ్‌కు తమ మీద ఎంత కోపం ఉన్నా శ్రవణ్ మీద ఉండదని భావించామన్నారు. సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కారన్నారు.