సీపీఐ కార్యాలయంపై దాడి.. చాడా కారు ధ్వంసం..!

హైదరాబాద్ లోని సీపీఐ కార్యాలయం (మగ్ధుంభవన్) వద్ద ఆదివారం సాయత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలోని కారును ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ అలజడి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంపై ఆదివారం సాయంత్రం 6.30గంటలకు బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాలయం ముందు నిలిపి ఉంచిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కారు అద్దాలను కూడా ఆకతాయిలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలియజేయడంతో వారు హుటాహుటిన కార్యాలయాలనికి చేరుకున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన వెంటనే డిజిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కు చాడ వెంకటరెడ్డి ఫోన్ ద్వారా జరిగిన సంఘటన వివరాలను తెలియజేశారు.దీంతో నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారును ధ్వంసం చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. లోతైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.