హైదరాబాద్ రోడ్లపై విజయశాంతి ట్వీట్ చేశారు. ఇటీవల వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు గ్రేటర్లోని రోడ్లన్నీ దెబ్బతిన్నయి. ఎక్కడికక్కడ గుంతలు పడి కంకర తేలింది. ఇసుక, మట్టి మేటలు వేసింది. ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న జల్లులకు గుంతల్లో నీళ్లు నిలుస్తున్నయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, 90 శాతం రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు ఇలాగే ఉన్నయి. దాదాపు 20 వేలకు పైగా పాట్ హోల్స్ ఉన్నయి. వానలు తగ్గుముఖం పట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేస్తమని అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు జరగడం లేదు. మరో వైపు వానలు తగ్గాయి… రోడ్లు వేయండని జనం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు వినతులు ఇస్తున్నరు. దీంతో అధికారులు కొన్నిచోట్ల నామమాత్రంగా పాట్హోల్స్ పూడ్చి చేతులు దులుపేసుకుంటున్నారని రాములమ్మ.
కంకర, డాంబార్ పోసి వదిలేస్తున్నరు. కొన్ని గంటల్లోనే మళ్లీ అక్కడ గుంతలు ఏర్పడుతున్నయి. వానలు ఆగి మూడు రోజులు దాటినా బల్దియా అధికారుల్లో చలనం లేదు. గుంతలను పూడ్చేందుకు అత్యవసర బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా నామమాత్రంగా నియమించారు. ఖైరతాబాద్, ఫలక్ నుమా, చందానగర్, మియాపూర్, కార్వాన్, జియాగూడ, చార్మినార్, సికింద్రాబాద్, టోలిచౌకి, మల్కాజిగిరి ఇలా అనేక ప్రాంతాల్లో గుంతలు దర్శనమిస్తున్నయి. రోడ్ల సమస్యలపై బల్దియాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నయి. అయినా సర్కార్ గానీ, జీహెచ్ఎంసీ గానీ ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు విజయశాంతి.