కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గుంతల్లోనే తొక్కిపడేయడం ఖాయం – విజయశాంతి

-

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గుంతల్లోనే తొక్కిపడేయడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి. గ‌త నెలలో కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పంటలు, రోడ్లు, వంతెనలు, ఇండ్లు, భగీరథ పైప్ లైన్లు ధ్వంస‌మయ్యాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని కోతకు గురయ్యాయి. దాదాపు రూ.423 కోట్ల నష్టం జరిగింది. నెల రోజులు గడుస్తున్నా… ఇంతవరకు ఒక్క రోడ్డు కూడా రిపేర్​కి నోచుకోలేదు. మరోసారి వర్షాలు పడితే పరిస్థితి ఇంకా దారుణంగా త‌యారు కానుందన్నారు.


అయితే దెబ్బతిన్న రోడ్ల రిపేర్ కోసం ప్రభుత్వం రూ.82లక్షలు రిలీజ్​ చేసింది. మరో రూ.16 లక్షలు కలెక్టర్ ఫండ్స్ నుంచి ఖర్చుచేయాలని ఆదేశించింది. జైనథ్ మండలం ఆనంద్​పూర్​ గ్రామం వద్ద పెన్ గంగా నదిపై ఉన్న బ్రిడ్జి వర్షాలకు దెబ్బతిన్నది. ఇచ్చోడలో ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లే రోడ్డుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. గవర్నమెంట్​ నుంచి రిలీజ్​ అయిన డబ్బులతో ఈ రెండు వంతెనల పనులు మాత్రమే చేయించారు. మిగతా రోడ్ల పరిస్థితి అట్లే ఉంది. మొన్నటి వర్షాలకు ముథోల్-ధర్మాబాద్ ​రోడ్డు అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్వత్ రోడ్డు, వంతెన కోతకు గురయ్యాయి. ఈ రూట్​లో ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నరు. ముథోల్​ టు ఎల్వత్ మీదుగా ధర్మబాద్ 9 కిలోమీటర్లు ఉండగా 7 కిలోమీటర్ల రోడ్డు మొత్తం దెబ్బతిన్నది. మార్గమధ్యంలో రెండు బ్రిడ్జీల మధ్య పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డయి. ముథోల్, తానూర్, భైంసా, లోకేశ్వరం మండలాల ప్రజలు వివిధ అవసరాల కోసం మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్తుంటరు. వ్యాపార, వాణిజ్య పనుల నిమిత్తం వేలాది మంది అటూ ఇటూ తిరుగుతుంటరు. రాత్రిపూట ఈ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటే భయపడుతున్నరు. ఇటీవల పలువురు గుంతల్లో పడి గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు సత్వరం స్పందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ పాలకుల్ని ప్రజలు ఆ గుంతల్లోనే తొక్కిపడేయడం ఖాయమని స్పష్టం చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news