వానపాముల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నారని హాస్టళ్ల తీరుపై విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ తీవ్ర నిర్యక్ష్యం చేస్తోంది. ఇక గురుకులాలను అయితే అసలే పట్టించుకోవడంలేదు. బుక్కెడు బువ్వ కోసం గురుకులాల్లోని విద్యార్థులు తీవ్ర పోరాటమే చేయాల్సి వస్తోంది. ఒకచోట పాచిపోయిన కూర పెడుతున్నరు. మరోచోట పురుగుల అన్నం తినమంటున్నారని మండిపడ్డారు.
తాజాగా పాలకూర పప్పులో ఏకంగా వానపామునే వడ్డించేశారు. ఫలితంగా, రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాల్లోని వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అస్పత్రుల పాలయ్యారు. మన భావి పౌరులు కలుషిత ఆహారం తిని రోగాల బారిన పడుతూనే ఉన్నరు. గురుకులాలు తెరిచిన తర్వాత వరుసగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని విమర్శలు చేశారు.
వారం రోజుల వ్యవధిలో ఎక్కడో ఒకచోట విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నరు. తాజాగా మహబూబాబాద్ జిల్లా మానుకోట గిరిజన బాలికల గురుకులంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు అందించిన పాలకూర పప్పులో వానపాములు ఉండటంతో ఆహారం కలుషితమై ఒక్కొక్కరుగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ విద్యార్థి లోకం తప్పక తగిన సమాధానం చెప్పి తీరుతుందని ఆగ్రహించారు విజయశాంతి.