“విజయశాంతి “ఈ పేరు గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల వైఖరి కారణంగా, విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆమె పార్టీ మారబోతున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం నడిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ నాయకులు ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా సరే, కీలకమైన సభలు, సమావేశాలకు పిలవకపోవడం, వంటి వ్యవహారాలతో ఆమె చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం కు కూడా విజయశాంతి దూరంగా ఉండడంతో పాటు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయినట్లు వార్తలు రావడంతో, ఆమె పార్టీ మారిపోతారని దాదాపుగా అంతా ఫిక్స్ అయిపోయారు.
ఆమె గతంలో బీజేపీ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించడంతో, తిరిగి ఆ పార్టీలో చేరబోతున్నారని, కీలకమైన పదవి కూడా దక్కబోతోంది అంటూ అదే పనిగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆమెపై ఈ విధమైన ప్రచారం చాలా రోజులుగా వస్తున్నా, ఈ వ్యవహారాలపై ఎప్పుడూ స్పందించకపోవడంతో, పార్టీ మార్పు నిజమే అని నమ్ముతూ వచ్చారు . మరి కొద్ది రోజుల్లో బీజేపీ కండువా కప్పుకోవడం తప్పదు అంటూ ప్రచారం జరిగింది. అయితే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏఐసీసీ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ విజయశాంతి వ్యవహారంపై నిన్ననే స్పందించారు. ఆమె పార్టీ మారే అవకాశమే లేదని, ఆమెకు పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందులను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పరిష్కరిస్తారని, తాను కూడా విజయశాంతితో చాలాసార్లు మాట్లాడానని ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరు అంటూ చెప్పారు.
అయితే మధుయాష్కి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు ఛానల్స్ లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని , వాస్తవాలు మాట్లాడిన మధు యాష్కీ గారికి నా ధన్యవాదాలు ‘ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తో ఆమె పార్టీ మారే ఆలోచన లేదని , కేవలం ఆమె అంటే గిట్టని కాంగ్రెస్ లోని కొంతమంది ఈ విధమైన ప్రచారానికి పాల్పడుతున్నారనే క్లారిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం పార్టీలోని తన రాజకీయ ప్రత్యర్థుల గురించి ఎక్కడా , నేరుగా స్పందించకుండా ఈ విధంగా పోస్ట్ పెట్టడం, తాను పార్టీ మారడం లేదంటూ ఖరాఖండీగా చెప్పకపోవడంతో ఇంకా ఇంకా ఆమె పార్టీ మార్పు వ్యవహారం పై అనుమానాలు వీడడం లేదు.
-Surya