నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఈ నెల 28న నీటిని విడుదల చేయనున్నట్లు డ్యామ్ ఎస్ఈ ధర్మనాయక్ మంగళవారం రాత్రి తెలిపారు. ఎడమకాల్వ ఆయకట్టు పరిధి మొదటి పంట సాగు నిమిత్తం మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేస్తారన్నారు.
మరోవైపు భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తోన్న వరదతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 547.50 అడుగులకు చేరింది.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నుంచి 60,417 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా.. ప్రస్తుతం 204.3045 (గరిష్ఠ స్థాయి 312.0505) టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ నుంచి 1,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు పేర్కొన్నారు.