అర్జెంటుగా తలరాతలు మారిపోవాలి. అర్జెంటుగా ఏం జరిగినా కూడా అవన్నీ మన మంచికే అన్న రీతిలో జరిగిపోవాలి. అందుకే తెలంగాణ కేంద్రంగా రాహుల్ పర్యటనను ఎంచుకున్నారు. మార్పును విపరీతంగా కోరుకుంటున్న నేలపై పర్యటిస్తే మంచి ఫలితాలు అందుకోవడం సులువు. ఆ విధంగా తెలంగాణ వాకిట రాహుల్ తన పర్యటనను విజయవంతం చేసుకోవాలన్న ఆలోచన నుంచి దృక్పథం వరకూ ప్రయాణిస్తున్నారు. ఆలోచన బాగుంటే దృక్పథాలు సంబంధిత గళాలు గణాలు బలపడతాయి. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి గణాలు బాలేవు. గళాలు బాలేవు.
ఓ విధంగా తమదైన పోరాటాలు చేయకనే గులాబీ దండును నిలువరించలేకపోతున్నది అన్నది ఓ వాస్తవం.అందుకే రానున్న కాలంలో రేవంత్ కన్నాబలమైన నాయకుల తయారీకి కాంగ్రెస్ సిద్ధం కావాలి. వీలుంటే రేవంత్ రెడ్డి ని మార్చి ఆ స్థానంలో మరొకరిని నిలిపినా తప్పేం లేదు. ఎందుకంటే రెడ్డి ప్రాబల్యం నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ బయటకు రావాలి. ఆ విధంగా కొన్ని కొత్త మార్పులు చేస్తూనే, ఉద్యమ పంథాను కొనసాగిస్తే కేసీఆర్ లాంటి దిగ్గజ నాయకులను ఇంటికి పంపడం సాధ్యం. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా రేపటి వేళ అయినా ఇలాంటి అనూహ్యతలేవో సాధ్యం కావొచ్చు.
కాంగ్రెస్ కు ఒక్క రాహుల్ కాదు రాములా వంద మంది రాహుల్ లాంటి నాయకులు కావాలి. యువ నాయకత్వం కావాలి. ఆ విధంగా 51 ఏళ్ల రాహుల్ కు గాంధీల నేపథ్యం కన్నా ఉద్యమ నేపథ్యం ఇవాళ ఎంతో అవసరం. అందుకు తెలంగాణ కేంద్ర బిందువు కావాలి. ఉద్యమాల ఖిల్లా వరంగల్లు కు ఇవాళ వస్తున్నారాయన. రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ నేలపై నడయాడి, ఇక్కడి ప్రజలతో మమేకం అయి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. గాంధీల కుటుంబ నేపథ్యం కారణంగానే ఆయన తన ఉనికికి భంగం వాటిల్లే పనులు చాలా చేశారేమో అని అనిపిస్తోంది. కనుక ఆ నేపథ్యం వదులుకుని ఓయూకు వెళ్లాలి.. ఓరుగల్లుకు వెళ్లాలి లేదా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ అనుసారం ఓరుగల్లుకు వెళ్లి ఓయూకు వెళ్లాలి.