బిఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో చిన్న దొర పూలు పెట్టాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవన్నారు. దేశాలు దాటి పచ్చి అబద్ధాలు వల్లించినా అవి నిజాలు అవ్వవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అన్నారు.
తెలంగాణ ప్రజలకు జీవధార కాదు.. నీ కుటుంబానికి కమీషన్ల ధార… తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార అని విమర్శించారు. కాళేశ్వరం అంటే తండ్రీకొడుకులు ఎప్పుడు కమీషన్లు కావాలన్నా వాడుకునే ఏటీఎం అంటూ దుయ్యబట్టారు షర్మిల. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఒక అద్భుతం కాదు “మెగా” వైఫల్యం అని ఆరోపించారు. మీలాంటి పనిమంతులు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు గాలివానకే కూలిన “మెగా” కట్టడం అని.. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో మీకే తెలియని అయోమయ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
చిన్న దొర 90 లక్షలు అంటాడు.. పెద్ద దొర 45 లక్షల ఎకరాలు అంటాడు.. హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అంటాడు.. సర్కారు వెబ్ సైట్ లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్తారు. కమీషన్ల కాళేశ్వరంపై ఎవరి మాట నిజం..? ఎవరి మాట అబద్ధం..? అని ప్రశ్నించారు.