కెసిఆర్ దొంగ కాదు.. గజదొంగ – వైయస్ షర్మిల

కెసిఆర్ దొంగ కాదు.. గజదొంగ అని అన్నారు వైయస్ షర్మిల. షాద్ నగర్ వైయస్సార్ సర్కిల్ వద్ద వైయస్సార్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పాదయాత్రలో భాగంగా సభలో పాల్గొన్న వైయస్ షర్మిల మాట్లాడుతూ.. 8 సంవత్సరాల నుంచి కెసిఆర్ చేస్తున్నది మోసమేనని అన్నారు. కెసిఆర్ చేతిలో మోసపోని వర్గం తెలంగాణలో లేనే లేదన్నారు.

కెసిఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ షాద్ నగర్ కి ఎంతో చేశారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని షాద్నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారని అన్నారు. ఇందిరా క్రాంతి గేదెల పథకం ఈ నియోజకవర్గము నుంచే ప్రారంభించారని.. ఇంటర్ కాలేజీ కావాలని అడిగితే వెంటనే ఇచ్చారని అన్నారు.

అలాగే డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేశారని, మంచినీటి సౌకర్యం, పార్కులు ఏర్పాటు చేయించారని అన్నారు. షాద్నగర్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎంత చేస్తే.. కెసిఆర్ చేసింది మోసమేనన్నారు.” లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేస్తామని తట్టెడు మట్టి ఎత్తలేదు. కుర్చీ వేసుకుని కూర్చుని పని పూర్తి చేస్తా అన్నారు చేశారా?. 8 ఏళ్ళు అయినా రిజర్వేషన్లు పట్టించుకోలేదు. షాద్నగర్ నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అంట కదా. తండ్రి అంజయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్ అంట కదా.

మూడు కాయలు పారు పువ్వులు అనే స్థాయిలో దందాలు చేస్తున్నారు అంట కదా. వీళ్ళ ఆగడాలకు ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకున్నారట. ఎమ్మెల్యే కాకముందు అంజయ్య యాదవ్ అప్పుల్లో ఉన్నారట కదా. ఇప్పుడు వేల ఎకరాలు.. నేలకోట్ల ఆస్తులు సంపాదించారంట కదా. అగ్గువకు భూములు గుంజుకోవడం.. ఎక్కువకు అమ్ముకోవడం. ఇదే తెలుసు ఈ ఎమ్మెల్యే కొడుకులకు. ప్రాణాలు తీస్తున్న ఈ ఎమ్మెల్యేకి, ఆయన కొడుకులకు ఉసురు తగలక మానదు”. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల.