తెలుగు రాష్ట్రాల మధ్య కాక పుట్టిస్తోన్న జలజగడం

-

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరోసారి కాక పుట్టిస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ స్పందించడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ పై చర్చ మొదలైంది. ఏపీ ప్రాజెక్టులు కట్టి నీటిని దోచుకుపోతుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారని విపక్షనేతలు మండిపడడంతో నీటి వివాదం పై రగడ మళ్లీ మొదలైంది.

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఆర్డీఎస్ వివాదం చిచ్చురేపింది. ఆర్డీఎస్‌ కుడి కాలువను ఏపీ అక్రమంగా నిర్మిస్తోందంటూ తెలంగాణ ఆరోపిస్తోంది. దీని పై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీఎస్‌ నుంచి 15 టీఎమ్‌సీల నీటి వాటాను తీసుకుని తీరుతామన్నారు. నీళ్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.అవ‌స‌ర‌మైతే శాస‌న‌స‌భ స‌భ్యులంద‌రూ ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం కానీ .. నీటి హ‌క్కుల విష‌యంలో రాజీప‌డే ప్రశ్న ఉత్పన్నమే కాద‌న్నారు కేసీఆర్.

ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ దగ్గర అక్రమంగా కుడి కాల్వ నిర్మిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీని వల్ల పాలమూరు జిల్లా ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీఎస్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ తీరుపై అటు బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తుంది. ఏపీ ప్రాజెక్ట్‌లు కట్టి నీళ్లు దోచుకుపోతుంటే.. కేసీఆర్‌ చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు.

తుంగభద్ర నదిపై ఏపీ సరిహద్దులో ఆర్డీఎస్ ఆనకట్టను అప్పటి నిజాం సర్కార్ నిర్మించింది. అప్పట్లో నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా నదిలోని నీటిని దిగువకు వదిలేందుకు స్లూయిస్ ఏర్పాటు చేశారు. ఆనకట్ట నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ స్లూయిస్​ను మూసి వేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు సైతం..స్లూయిస్​ మూసివేతకు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా స్లూయిస్ ద్వారా అధిక మొత్తంలో నీరంతా దిగువకు వెళ్తుండడంతో వరద జలాలతోపాటు, తెలంగాణకు కాలువ ద్వారా ఇండెంట్ ప్రకారం రావాల్సిన వాటా దక్కడం లేదనే వాదనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news