హైదరాబాద్: నైరుతీ రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళో, రేపో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. అయితే ఇది ముందుగా అల్పపీడనంగా మారితేనే ఏదైనా సాధ్యమని అంటున్నారు. ఇప్పటికే దేశ తూర్పు, పడమర తీరాలపై టౌటే, యాస్ తుఫానులు విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించాయి. మేలో ఈ రెండు తుఫానులు ధాటికి తూర్పు, పడమర తీర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.. ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం కోలుకోలేని విధంగా జరిగింది. నైరుతీ రుతుపవనాలు ప్రస్తుతం కేరళను తాకాయి.
ఇవి మరింత బలపడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావం వల్ల తూర్పు తీరంతో పాటు మధ్య భారతంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. మహారాష్ట్రలో యాస్ తుపాను వల్ల తీవ్ర నష్టం జరిగిందని…. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని ప్రధాని మోడీని మహా సీఎం ఉద్దవ్ కోరారు. అలాగే బెంగాల్లో టౌటే తుపాను వల్ల భారీ నష్టమే జరిగింది.