ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలపై తొలగని ఉత్కంఠ.. సీఎం వద్ద చర్చ జరగలేదన్న మంత్రి

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలపై ఉత్కంఠ కొనసాగతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. పరీక్షలపై సుప్రీం నోటీసులు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనన్నారు. ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

కాగా ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలను విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్ బోర్డు నుంచి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 2లోగా టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడించేలా ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు అందజేశారు.