తమ ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య సీబీఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వెళ్లితే.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. 74 ఏళ్ల వయసున్న లాలూను కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిరంతరం హింసిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే దానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు.
ఇప్పుడు జరుగుతున్నదంతా గుర్తుంచుకుంటానని… అన్నిటికన్నా కాలం చాలా బలమైనదని చెప్పారు. 74 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో ఉన్న అధికార పీఠాన్ని షేక్ చేసే సత్తా తన తండ్రికి ఉందని అన్నారు. తమ ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. లాలూ ప్రసాద్ కి గత డిసెంబర్ లో సింగపూర్ లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు తనకున్న రెండు కిడ్నీల్లో ఒకదాన్ని రోహిణి డొనేట్ చేశారు. సింగపూర్ లో ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయన తన మరో కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు.