గుంటూరు జిల్లాలో తాడికొండ ఎంతో కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఉంటోన్న ఆమె రాజకీయాలకు కొత్త. ఆమెకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడే పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఆర్థిక కోణాల నేపథ్యంలోనే జగన్ ఆమెకు సీటు ఇవ్వగా… వైసీపీ వేవ్‌లోనే ఆమె టీడీపీ కంచుకోటలో విజయం సాధించారు. ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు.
ఇక ఆమె పోలీసు అధికారులకు వార్నింగ్ ఇస్తోన్న ఆడియోలు సైతం మీడియాకు లీక్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఆడియో మరొకటి లీక్ కావడంతో నియోజకవర్గంలో పార్టీ పరువు బజారున పడింది. సీఎం జగన్ నుంచి పార్టీ పెద్దలు అందరూ ఉన్న నియోజకవర్గంలో పార్టీ పరువు పోతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి పేకాట క్లబ్‌లను ఓపెన్ చేయించే విషయంలో పార్టీ బహిష్కృత నేత సందీప్ శ్రీదేవి ఏకంగా పేకాటను ప్రోత్సహించారని ఆడియో లీక్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియో బయటకు వచ్చాక శ్రీదేవి పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తుండడం మరింత వివాదంగా మారింది.
శ్రీదేవిని టార్గెట్ చేస్తోన్న సొంత పార్టీ నేతలు… ఆ ముగ్గురేనా…!
ఇక వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి శ్రీదేవిని సాగనంపేందుకు పార్టీకే చెందిన ఓ ఎంపీ, పార్టీ మారి ఎమ్మెల్సీ అయిన నేత, తాడికొండ పక్కనే ఉన్న మరో నియోజకవర్గ ఎమ్మెల్యే ముగ్గురు కలిసి ఆమెను టార్గెట్ చేస్తున్నారని.. ఈ క్రమంలోనే ఏ చిన్న విషయం కూడా వదలకుండా ఆమెపై రోజు రోజుకు వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారన్న గుసగుసలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. ఓ ఎంపీ ఎన్నిలైనప్పటి నుంచే ఇక్కడ గ్రూపును ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాడికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సదరు ఎంపీ చాపకింద నీరులా శ్రీదేవిని టార్గెట్ చేశారట. అయితే సడెన్‌గా పార్టీ మారి ఎమ్మెల్సీ అయిన మరో నేత సైతం ఇప్పుడు ఇదే నియోజకవర్గంపై కన్నేయడంతో రోజు రోజుకు శ్రీదేవికి టార్గెట్ చేసే శత్రువులు ఎక్కువ అవుతున్నారు. మరోవైపు ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా తాడికొండ నియోజకవర్గంలో శ్రీదేవి తన మాట నెగ్గనీయడం లేదనే అక్కసుతో ఆమెను వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారట. ఏదేమైనా ఈ ముగ్గురు త్రయం వల్లే శ్రీదేవి రహస్యాలన్ని ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయంటున్నారు.