నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తున్న వైనంపై గడిచిన మూడు రోజులుగా ఆ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజు ఆందోళనల్లో ఓ మోస్తరు తోపులాట చోటుచేసుకుంది. తాజాగా బుధవారం మాత్రం పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డగించాగా.. ప్రతిగా కార్యకర్తలు కూడా పోలీసులకు ఎదురుతిరిగారు. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యాలయంలో చొచ్చుకొని వెళ్లిన పోలీసులు.. అప్పటికే అక్కడ ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఏఐసీసీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారని పార్టీ నేతలు ఆరోపించారు.
అంతేకాకుండా తమ పార్టీ శ్రేణులు పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా గురువారం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజభవన్ లను ముట్టడించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చింది.