అందరూ కరోనా గురించి చాలా వరకూ మర్చిపోయారు.. ఒక పెద్ద నష్టం జరిగి దాని నుంచి మెల్లగా కోలుకుంటూ ఆ రోజులను మర్చిపోతూ.. లైఫ్‌లో ఎలాగోలా ముందుకెళ్తున్న రోజులివి.. చిన్న నుంచి పెద్ద వరకూ.. కార్మికుడి నుంచి కంపెనీ సీఈవో వరకూ అందరూ కరోనా బాధితులే.. ఎవరికి ఎంత నష్టం జరగాలో అంత జరిగేసింది.. మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో కరోనా వస్తుందన్న వార్త వింటుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. సోషల్ మీడియాలో లాక్‌డౌన్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.. ఈ టైమ్‌లో జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష.. ఇండియాలో కేసులు పెద్దగా లేవు కదా అని లైట్ తీసుకోవద్దు.. అయితే మ్యాటర్ ఏంటంటే.. కరోనా భయంతో ఓ జంట వెరైటీగా ఆలోచించి ఒక ఐడియా వేసారు.. వాళ్లు చేసిన పనికి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
కోవిడ్ -19 చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా చైనాలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు కరోనా బారిన పడుతున్నారు. అధికారికంగా చైనా తన రోజువారీ కేసుల డేటాను దాచిపెడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే చైనాలో ప్రతిరోజూ కోట్ల కొద్దీ కొత్త కేసులు వస్తున్నాయని అనేక మీడియా నివేదికలు చెప్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్,ఏఎఫ్‌పీ సహా అనేక ఏజెన్సీలు చైనీస్ ఆసుపత్రులు, శ్మశానవాటికలో మృతదేహాలతో నిండి ఉన్నాయని నివేదించాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రజలు కోవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కోవటానికి చైనా ప్రజలు తమ సొంత పద్ధతులను అవలంబిస్తున్నారు.
అందులో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇప్పటికే చైనీస్ నిమ్మకాయల మీద పడ్డారు.. కనిపిస్తే చాలు కొనేస్తున్నారు. వ్యాక్సిన్స్‌తో లాభం లేదని నిమ్మకాయల మీద ఆధారపడుతున్నారు. కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందు ఓ జంట తాత్కాలిక ‘షీల్డ్’ని ఉపయోగించారు. ఈ జంట వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చైనా రాష్ట్ర అనుబంధ మీడియా పీపుల్స్ డైలీ పోస్ట్ చేసింది. ఇందులో ఒక జంట తమను తాము ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం నుంచి రక్షించుకుంటూ కూరగాయల కోసం షాపింగ్ చేస్తున్నట్లు ఉంది. వీడియోలో జంట తమను తాముపై నుంచి కిందకి ప్లాస్టిక్ షీట్‌లో కప్పుకుని.. గొడుగుతో పట్టుకుని ఉంటారు. ఆ గొడుకు కిందనే ఇద్దరూ ఉండి అడుగులో అడుగు వేసుకుంటూ కూరగాయలు కొంటున్నారు. వాళ్లను చూసిన వాళ్లంతా అర్రే ఇదేం ఐడియా అన్నట్లు మొఖం పెడుతున్నారు. కొందరైతే ముఖంపైనే నవ్వేస్తున్నారు. మీరు కూడా చూడండి ఆ వీడియో.!