వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి చిన్నారిని ఎత్తుకెళ్లిన కుక్క.. శిశువు మృతి!

వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి బెడ్‌పై నుంచి మూడు రోజుల చిన్నారిని కుక్క ఎత్తుకెళ్లింది. ఈ ఘటన హరియాణాలోని పానిపట్‌ జిల్లాలో చోటు చేసుకుంది. శిశువుకు తీవ్ర గాయాలు అవ్వడంతో మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పానిపట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పబ్నం అనే మహిళకు మూడు రోజుల క్రితం శిశువు పుట్టింది. రాత్రిపూట అందరూ నిద్రిస్తుండగా.. ఆస్పత్రిలోకి శునకం ప్రవేశించింది. తల్లి పక్కన పడుకున్న శిశువును నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

Newborn-Baby-Eaten-By-Street-Dogs
Newborn-Baby-Eaten-By-Street-Dogs

తెల్లవారుజామున 2 గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. దీంతో ఆమె ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది, బంధువులు చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లి వెతికారు. ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రాంతంలో కుక్క శిశువును నోట కరుచుకుని ఉండటాన్ని గుర్తించారు. దీంతో వైద్య సిబ్బంది కుక్క నోట్లో నుంచి శిశువును విడిపించారు. గాయాలతో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన క్రమంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.