ఓ వైపు కరోనా వైరస్‌తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఇప్పుడు డెంగ్యూ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులతో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా అధికమవుతుండటంతో ఎవరికి ఏం జ్వరమో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. సాధారణ జ్వరం వచ్చినా అది కరోనాయేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
దీంతో బాధితులకు జ్వ్వరాలపై తగిన స్పష్టత వుండాలని ఆరోగ్యశాఖాధికారులు భావిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ శిబిరాలు నిర్వహించి, ఎవరికి ఏ జ్వరమో తేల్చి, తగిన చికిత్స అందించాలని కూడా వారు ఆదేశాలుజారీ చేశారు. మున్ముందు ఈ జ్వరాలు పెరిగే అవకాశముండడంతో తక్షణం చర్యలకు ఉపక్రమించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ జ్వరాలు అధికమైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరాలను నిరోధించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ సెల్వవినాయగం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.