రాజధాని రైతుకు శుభవార్త ఇది. కౌలు చెల్లింపు విషయమై ఇప్పటి వరకూ నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. వీరికి నిధులు అందించేందుకు జగన్ సర్కారు ముందుకు వచ్చింది. ఓ విధంగా కోర్టు జోక్యం చేసుకునే ముందే సంబంధిత వర్గాలు అప్రమత్తం అయి నిధులు అందించేందుకు సంబంధిత చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనే ఇదే విధంగా కౌలు చెల్లింపుల్లో జరిగిన జాప్యంపై హై కోర్టు సీరియస్ అయింది. దీంతో తాజాగా అప్రమత్తం అయిన అధికారులు కౌలు రైతులకు 184 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముందుకువచ్చారు. వార్షిక కౌలు విడుదలకు సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ నిధులను సమకూర్చుకుని రెండు విడతల్లో జమ చేసేందుకు ముందుకు వచ్చింది.
వార్షిక కౌలు చెల్లించేందుకు ఒప్పందం మేరకు 208 కోట్ల రూపాయలు బడ్జెట్ ను విడుదల చేసింది. అందునుంచి 184 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో మొదటి విడతగా 23 వేల మంది రైతులకు పైగా తొలి విడతగా ఈ నెల 27 న 112 కోట్ల రూపాయలు, మంగళవారం మిగిలిన 72 కోట్లు విడుదల చేశారు. మొత్తం 184 కోట్ల రూపాయలు అందించేందుకు సంబంధిత అకౌంట్లకు డబ్బులు జమ చేసింది. గత ఏడాది రాజధాని రైతులకు 195 కోట్లకు బడ్జెట్ విడుదల చేయగా , 188 కోట్లు చెల్లించారు. వివాదాల్లో ఉన్న భూములకు, కోర్టు విచారణలో ఉన్న భూములకు మినహాయింపు ఇచ్చారు. ప్రతి ఏటా మే నెల మొదటి వారంలోనే చెల్లించాల్సిన కౌలు మూడేళ్లుగా ఆలస్యం అవుతూనే ఉందని రాజధాని రైతులు అంటున్నారు.