ఫేస్ మాస్క్ ధరించకుండా పట్టుబడిన వారందరినీ ఏ కోవిడ్ కేర్ సెంటర్ లో అయినా సరే సమాజ సేవ కోసం పంపే విధానాన్ని తీసుకురావాలని గుజరాత్ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ కోవిడ్-కేర్ సెంటర్ లో అయినా ఐదు నుంచి పదిహేను రోజుల పాటు ఉంచాలని కనీసం నాలుగైదు గంటలు నాన్-మెడికల్ డ్యూటీ చేస్తారని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘించినవారు శుభ్రపరచడం, ఇంటిపని, వంట, సహాయం, సేవ, రికార్డుల తయారీ, డేటా కీపింగ్ మొదలైన పనులు చేయాల్సి ఉంటుంది. వయసు ప్రకారం వారికి సేవలను కేటాయిస్తారు. ఈ జరిమానా వర్తింపుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును డిసెంబర్ 24 న ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.