శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థికంగా, ఇంధన, నిత్యావసరాల సమస్యతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశ ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే శ్రీలంక ప్రభుత్వం మరోసారి అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది
తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే ఎమర్జెన్సీ విధించారు. దేశ ప్రజలకు భద్రత కల్పించడం, ఇంధన సదుపాయం, నిత్యావసరాల ఏర్పాటు తదితర వనరుల ఏర్పాటుకు ఆటంకం లేకుండా చూడటానికి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు విక్రమ సింఘే తెలిపారు. 1959లోని 8వ చట్ట సవరణ ప్రకారం.. తనకు అందిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాత్కాలిక అధ్యక్షుడు తెలిపారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులో ఉంటుందన్నారు. ప్రజలందరూ సహకరించాలని విక్రమ సింఘే తెలిపారు.