దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ పూర్తయింది. నేడు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి సీఎం స్టాలిన్‌ను కలిసి నివేదిక సమర్పించనున్నారు. మాజీ సీఎం జయలలిత మృతి వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ గత 5 ఏళ్లుగా వివిధ పార్టీలను విచారించింది. జయలలిత బంధువులు, సహచరులు, మాజీ మంత్రులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, పోలీసులకు విచారణ జరిపింది.
దాదాపు 158 మందిని కమిషన్ విచారణ జరిపింది. కాగా, చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందించిన చికిత్సపై అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పుడు జయలలిత నెచ్చెలి శశికళ, పార్టీ నేతలతో సహా ఎవరినీ జయలలితతో కలవనివ్వలేదు. దీంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కమిషన్ విచారణ జరిపింది. జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు జరగలేదని ఎయిమ్స్ వైద్యబృందం ఆరుముగ స్వామి కమిషన్‌కు తెలిపింది. ఈ మేరకు కమిషన్ మూడు పేజీల నివేదికను తయారు చేసింది.