గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఓ చెరువు నీటి రంగు గులాబీ రంగులో మారింది. దీంతో పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సుగాం గ్రామంలో ఉన్న ఈ చెరువు గులాబీ రంగులో మారడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఇది దేవుడి లీలగా భావిస్తున్నారు. ఈ విషయంలో అన్ని గ్రామాలకు వ్యాపించడంతో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు.
అయితే ఈ చెరువు వర్షపు నీటితో నిండుతుందని గ్రామస్తులు తెలిపారు. ఆ నీటితోనే గ్రామస్తులు నిత్యావసరాలకు వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక అధికారులు చెరువు దగ్గరికి చేరుకుని.. నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించారు. అలాగే కొద్ది రోజులపాటు ఈ నీటిని ఎవరూ వాడకూడదని గ్రామస్తులకు సూచించినట్లు అధికారి కేఏ భాటియా తెలిపారు. అయితే చెరువులో వరద నీరు చేరడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఉంటుందని, అలా నీరు గులాబీ రంగులోకి మారి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.