పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రజా తీర్పును జగన్ సర్కారుపై తిరుగుబాటుగా చూడాలన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందులలోను తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. జగన్ నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ను నమ్ముకున్న వారిని జైలుకు పంపారని రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
ధన బలం, రౌడీయిజం ఎప్పటికీ శాశ్వతం కాదు అని జగన్ తెలుసుకోవాలన్నారు. నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన కొనసాగించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ప్రచారం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడం పెద్ద సమస్యగా మారిందన్నారు చంద్రబాబు. కౌంటింగ్ హాల్లోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పులివెందుల నుంచి మనుషులను పంపారని.. పోరాడి చివరకు టిడిపి అభ్యర్థి గెలిచినా డిక్లరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.