ఇవీ ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లు …

-

తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుంచి స‌మ్మె బాట‌లో ఉన్నారు. న్యాయ బ‌ద్ధ‌మైన త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు కూడా తాము స‌మ్మెను విర‌మించేది లేదని ఇప్ప‌టికే అనేక మార్లు కార్మికులు వెల్ల‌డించారు. అయితే, ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక బాగోలేక పోవ‌డం(పైకి ఎవ‌రూ చెప్ప‌డం లేదు.. కానీ, ఇది నిజం. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు మిగులు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణ ఇప్పుడు దాదాపు 2 వేల కోట్ల లోటు బ‌డ్జెట్తో అల్లాడుతోంది)తో డిమాండ్ల‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ తీర్చేది లేద‌ని సీఎం కేసీఆర్ కూడా చాలా సార్లు వెల్ల‌డించారు.

ఇవీ ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లు ... విలీనం మాత్రమే కాదు
ఇవీ ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లు … విలీనం మాత్రమే కాదు

అంతేకాదు, అసలు రాష్ట్రంలో ఆర్టీసీనే ర‌ద్దు చేసే ప‌రిస్థితి ఉంటుంద‌ని, ప్రైవేటుకు అధికారం ఇస్తామ‌ని, ఈ విష‌యంలో ఏ కోర్టూ జోక్యం చేసుకునే అవ‌కాశం కూడా లేద‌ని ఆయ‌న ఇటీవ‌ల హెచ్చ‌రించారు.
దీంతో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె ప‌రిష్కారానికి కాకుండా స‌మ్మె నుంచి త‌ప్పించుకునేందుకే ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడు గులు వేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఈ విష‌యంలో హైకోర్టు జోక్యం చేసుకున్నా.. ప‌రిష్కారానికి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌మ‌ని కోరినా కూడా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల ఆర్టీసీ అధికారులు చ‌ర్చ‌కు కార్మికుల‌ను ఆహ్వానించారు. యూనియ‌న్ల నాయ‌కులు చ‌ర్చ‌కు వెళ్లినా మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీనిని బ‌ట్టి చ‌ర్చ‌లు కూడా ఫ‌లించ‌ని విష‌యం తెలిసిందే. దీంతో అస‌లు ఆర్టీసీ కార్మికులు ఏం కోరుతున్నారు? ఏం జ‌రుగుతోంది? అనే విష‌యం పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

కార్మికుల డిమాండ్లు ఇవీ..

  1. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
  2. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇవ్వవలసిన రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఇకమీదట క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయాలి.
  3. బడ్జెట్‌లో 1శాతం నిధులు కేటాయించాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న నష్టాలను వయబిలిటీ ఫండ్‌ కింద ఆర్టీసీకి చెల్లించాలి. బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలి. జిహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి.
  4. డిజిల్‌పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఎంవీ టాక్స్‌ను రద్దు చేస్తూ, అన్నిరకాల పన్నులపై మినహాయింపు ఇవ్వాలి.
  5. కండక్టర్‌, డ్రైవర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి.
  6. ఏప్రిల్‌1, 2017 నుండి రావాల్సిన జీతభత్యాల సవరణ వెంటనే చేయాలి.
  7. అన్ని క్యాటగిరీలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
  8. సిసిఎస్‌, పిఎఫ్‌, ఎస్‌ఆర్‌బిఎస్‌, ఎస్‌బిటీ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలి.
  9. రిటైర్డ్‌ ఉద్యోగులకు సెటిల్‌మెంట్‌తో పాటు సకలజనుల సమ్మె జీతాన్ని చెల్లించాలి.
  10. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలిస్తూ, అర్హతను బట్టి సూపర్‌వైజర్‌ పోస్టులు కూడా ఇవ్వాలి.
  11. వన్‌టైమ్‌ మెజర్‌ కింద ఇంటర్‌స్టేట్‌ / జోన్‌ / రీజియన్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేయాలి.
  12. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగినులకు ఇస్తున్న మాదిరిగా చైల్డ్‌కేర్‌ సెలవులు ఇవ్వాలి.
  13. మెడికల్‌ అన్‌ఫిట్‌, కలర్‌బ్లైండ్‌నెస్‌ ఉద్యోగులకు వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం నుండి తీసుకున్న మినహాయింపు సర్క్యులర్‌ను రద్దు చేయాలి.
  14. రిటైర్డ్‌ ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ మరియు ఆసరా పెన్షన్‌ ఇవ్వాలి.
  15. కాలం చెల్లిన బస్సులను తీసేయాలి. ప్రయివేటు బస్సులను రద్దుచేయాలి. కొత్త బస్సులను కొనుగోలు చేయాలి.
  16. విద్యుత్‌ బస్సుల ఫేమ్‌-2 పథకంలో మార్పులు చేసి, వాటిని ఆర్టీసీనే కొనుగోలు చేయాలి. వాటికి ప్రతిపాదించిన రాయితీలు ఆర్టీసీకి ఇవ్వాలి.
  17. తార్నాక హాస్పిటల్‌ను సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలి. మందులను కూడా అదే సరఫరా చేయాలి. ఉద్యోగుల తలిదండ్రులకు కూడా వైద్యసౌకర్యం అందుబాటులోకి తేవాలి.
  18. ఎంటీడబ్ల్యూ యాక్ట్‌ ప్రకారం డ్యూటీలు ఉండాలి. డబుల్‌ డ్యూటీలకు డబుల్‌ జీతాలు ఇవ్వాలి.
  19. మిగిలిపోయిన కాంట్రాక్ట్‌ / కాజువల్‌ కార్మికులతో పాటు పారామెడికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి.
  20. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, డిఏ అరియర్స్‌ చెల్లించాలి. యూనిఫామ్స్‌ సరఫరా చేయాలి.
  21. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం బస్సులు నడపాలి. అక్రమరవాణాను అరికట్టాలి.
  22. కొరియర్‌, పార్సిల్‌, గూడ్స్‌ రవాణాలకు ఆర్టీసీని అనుమతించాలి.
  23. సిబ్బంది నిష్పత్తికి అనుగుణంగా సూపర్‌వైజర్లను పెంచి, ఖాళీలను భర్తీ చేయాలి.
  24. గ్యారేజీ కార్మికుల పనిభారాన్ని తగ్గించి, అన్ని విభాగాల్లో అవుట్‌సోర్సింగ్‌ను ఎత్తేయాలి.
  25. నగరంలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 9గంటల వరకే ముగిసేట్టు డ్యూటీ వేయాలి.
  26. రెగ్యులేషన్‌-30లో పనిచేస్తున్న ఉద్యోగులను వారు చేరిన తేదీనుండే రెగ్యులరైజ్‌ చేయాలి.

అయితే వీటిలో చాలావరకు నిధులతో సంబంధం లేనివే. మిగిలినవాటికి రూ.47కోట్లు అవసరమవుతాయని లెక్క తేలింది. ఈ డబ్బు సర్దుబాటు చేస్తే, సమస్య వెంటనే పరిష్కారమవుతుందని, విలీనం, ప్రభుత్వ బకాయిలు వంటివి తర్వాత తేల్చుకోవచ్చని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలపై గుర్రుగా ఉన్న ఉన్నత న్యాయస్థానం, నిన్న ఏఏజీని ఉతికి ఆరేసింది. ఉన్నపళాన ఏజీని రమ్మని హుకుం జారీచేసింది. 47కోట్లు సముద్రంలో కాకిరెట్టంత అని వ్యాఖ్యానించింది. కానీ ప్రభుత్వం మెట్టుదిగేలా కనిపించడంలేదు. హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా ముందుకే వెళ్దామని నిర్ణయించినట్లు సమాచారం. సుప్రీంకోర్టుకయినా వెళ్దాం కానీ, వెనక్కితగ్గేదేలేదన్నది కేసీఆర్‌ నిశ్చితాభిప్రాయంగా అధికారులు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. ఇంకా ఏం జరగనుందో, మున్ముందు ఏమేం చూడాలో ఎవరికీ తెలియడంలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news