ఎండాకాలంలో వేడిమి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అనేక మార్గాలను వెతుక్కుంటారు. బయట ఎండలు మండిపోవడంతో శరీరం తొందరగా అలసి పోతుంది. నీటి స్థాయి తగ్గిపోయినప్పుడు శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి 20 నిమిషాలకు నీళ్లు, జ్యూసులు తాగుతుండాలి. అప్పుడే శరీరం అధిక వేడిమి నుంచి తప్పించుకోగలదు. అయితే ఈ కాలంలో చల్లచల్లని జ్యూస్‌లు తాగుతూ ఉంటే భలే అనిపిస్తది. చల్లగా ఉండే జ్యూసులు తాగుతున్నప్పుడు వచ్చే కిక్కే వేరు ఉంటది. జ్యూస్‌లలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంట్లోనే ఉంటూ కొన్నిరకాల జ్యూసులను తయారు చేసుకోవచ్చు.
ద్రాక్షరసం..
ముందుగా పావుకిలో ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. వాటిని ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. కడిగిన ద్రాక్ష పండ్లను జ్యూసర్‌లో వేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు మిరియాలపొడి, కొద్దిగా ఉప్పు వేసి గ్రాండ్ చేసుకోవాలి. జ్యాస్ అయ్యాక బయటకు తీసుకుని.. అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలు.. ద్రాక్ష జ్యూస్ రెడీ అవుతుంది.
పుచ్చకాయ జ్యూస్..
ముందుగా పుచ్చకాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులోని గింజలను తీసివేయాలి. తీసివేసిన తర్వాత ముక్కలను జ్యూసర్ జాడిలో వేసుకుని అందులో 4 చెంచాల పంచదార, అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. జ్యూసర్ పట్టి రసం చేసుకోవాలి. లాస్ట్‌లో చల్లగా పుచ్చకాయ జ్యూస్ తాగాలని ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.
తర్బూజా జ్యూస్..
తర్బూజా పండును చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. జ్యూసల్‌లో వేసి అందులో రెండు చెంచాలు పంచదార లేదా తేనె కలుపుకోవాలి. మిక్సీ పట్టాక అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. చల్లటి తర్బూజ జ్యూస్ రెడీ అయిపోతుంది.
పైనాపిల్ జ్యూస్..
ముందుగా పైనాపిల్‌ను తీసుకోవాలి. పైనాపిల్ పైన ఉన్న పొలుసులను తొలగించుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలను జ్యూసర్‌లో వేసి.. 4 టేబుల్ స్పూన్ల చక్కెర, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. లాస్ట్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది.