గోదావరి వరద ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతుందని మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుందని… ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.82 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిరంతరం వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తుందని.. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని వెల్లడించారు.
మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ 20 , తూర్పుగోదావరి లో 8 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని.. అల్లూరి జిల్లాలో 5 , పశ్చిమ గోదావరి 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏలూరులో 3, కాకినాడ 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని… సంబంధిత జిల్లాల,మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.