ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు.. ఎవరంటే?

-

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న సీనియర్ ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగంలో సక్సెస్ అయిన వ్యక్తి. సినీ రంగంలో విశేష ఆదరణ పొందిన ఎన్టీఆర్.. రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డుకెక్కారు. తెలుగు నాట రాజకీయాలను ప్రభావితం చేసిన ఫిల్మ్ స్టార్ గా ఆయన పేరు గాంచారు. అయితే, చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు అనగానే ఠక్కున ఎన్టీఆర్ పేరు చెప్తారు. కానీ, ఆయన కంటే ముందరే సినీ నటుడొకరు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనెవరో తెలుసుకుందాం.

సినీ, రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలుగొందిన సీనియర్ ఎన్టీఆర్..రెండు రంగాలకూ విశేష సేవలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ మాదిరిగా చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే..ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన తెలుగు సినీ నటుడు కొంగర జగ్గయ్య.

సినీ రంగం నుంచి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటిన వ్యక్తి కొంగర జగ్గయ్య. లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన జగ్గయ్య..గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకోవడంతో పాటు పలు అవార్డులు అందుకున్న జగ్గయ్య ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

జగ్గయ్య..ఎన్టీఆర్ తో కలిసి నాటకాలు కూడా వేశారు. తొలుత ప్రజా సోషలిస్టు పార్టీలో చేరిన జగ్గయ్య.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 1967లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో జగ్గయ్య ప్రత్యర్థిపై 80 వేల ఓట్ల మెజారిటీతో లోక్ సభ సభ్యుడిగా గెలుపొందారు. ఎంపీగా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక ఆ తర్వాత సినీ రంగం నుంచి 1984లో సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన సంచలనం గురించి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news