ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కోవిడ్ కారణంగా వాయిదా పడి గత సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్య జరిగిన విషయం విదితమే. అయితే త్వరలోనే 14వ ఎడిషన్ జరగనుంది. బీసీసీఐ 2021 ఐపీఎల్ ఎడిషన్ జరిగే తేదీలను ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ఆ టోర్నీ ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30న ముగుస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ ల మధ్య సిరీస్ జరుగుతున్న విషయం విదితమే. శనివారంతో టెస్టు సిరీస్ ముగిసింది. దీంతో టీ20లు, తరువాత వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో భారత్ ఇంగ్లండ్‌తో చివరి వన్డేను మార్చి 28వ తేదీన పూణెలో ఆడనుంది. తరువాత 12 రోజులకు.. అంటే.. ఏప్రిల్ 9న ఐపీఎల్ టోర్నీని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 30వ తేదీన టోర్నీని ముగించాలని చూస్తున్నారు.
అయితే వచ్చే ఐపీఎల్ టోర్నీని ఎప్పుడు నిర్వహించాలనే విషయం వచ్చే వారంలో తేలనుంది. ఈ మేరకు వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అయి ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఇక చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్‌లను ఈసారి ఐపీఎల్‌కు వేదికలుగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ముందుగా ముంబైని అనుకున్నా అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో వేదికను మార్చారు. ఇక చెన్నై, కోల్‌కతాల్లో అక్కడి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను ఏర్పాటు చేస్తారు. కాగా గత సీజన్‌లో ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆరంభ మ్యాచ్ అప్పటి విన్నర్ ముంబైకి, రన్నరప్ ఢిల్లీకి మధ్య జరగనుంది.