టీఆర్ఎస్ కంచుకోటలో కలవర పెడుతున్న వర్గపోరు

-

గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌ జిల్లాలో ఇప్పుడు వర్గపోరు పార్టీ క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తోందట. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరుతో బయటకు అలయ్ బలయ్ అంటూనే లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట.ఇక మరో నియోజకవర్గంలో టిక్కెట్‌ కోసం కుమ్ములాటలు సాగుతున్నాయట. పార్టీ కంచుకోటలో గ్రూప్‌ తగదాలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతుందట.


మెదక్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు అగ్గిరాజేస్తుందట. మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మధ్య అధిపత్య పోరు నడుస్తోందట. కొంతకాలంగా ఇరువురు నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి స్వగ్రామం మెదక్‌ నియోజకవర్గంలోని కూచన్ పల్లి కావడంతో ఆయన తరచు సొంతూరు వస్తుండటంతో నేతల తాకిడి పెరుగుతోంది. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఆయనను కలిసేందుకు క్యూ కడుతుండటం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి నచ్చడం లేదట. ఎమ్మెల్యే పద్మా, ఆమె భర్త దేవేందర్ రెడ్డితో విభేదాలు ఉన్న కొందరు నేతలు శేరిసుభాష్ రెడ్డి శిబిరంలోకి చేరిపోవడం వారికి నచ్చటం లేదు. ఇక మెదక్ మునిసిపాలిటీ పాలకవర్గంలోనూ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారట.

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రెకమండ్‌ చేసిన పనులను చేయొద్దని అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తుంటారన్న ఆరోపణ ఉంది. అంతేకాదు ఎమ్మెల్సీని కలిసిన నేతలు, ప్రజాప్రతినిధులపైనా ఆమె కారాలు, మిరియాలు నూరుతుంటారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల్లోనూ ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకునేందుకు పోటీ పడుతుంటారట. దీంతో ఇరువురి మధ్య ఆధిపత్యపోరు ఇటు పార్టీ నేతలతో పాటు అటు జిల్లా ఉన్నతాధికారులకూ తలనొప్పిగా మారిందంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని క్యాడర్ హడలిపోతున్నట్లు సమాచారం.

మరోవైపు నర్సాపూర్‌ నియోజకవర్గంలోనూ గులాబీ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ మురళీయాదవ్ వర్గాలుండేవి. అయితే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి గులాబీగూటికి చేరడంతో..నియోజకవర్గంలో వర్గపోరు మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలోనూ పార్టీ నేతలంతా మూడు గ్రూపులుగా విడిపోయారనే చర్చ సాగుతోంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.

2018 ఎన్నికల్లో మురళీయాదవ్ నర్సాపూర్ నుంచి టిక్కెట్ ఆశించినా.. సీఎం కేసీఆర్ మాత్రం మరోసారి మదన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. మాజీ మంత్రి అయిన తనకు వచ్చేసారి పార్టీ బీ ఫాం దక్కుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటరీలో ఉండటం ఆమెకు టిక్కెట్ రావడానికి సానుకూలాంశమని ఆమె అనుచరులు అంటున్నారట. మంత్రి హరీశ్ రావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్న తనకు బీసీ కోటాలో టిక్కెట్‌ వస్తుందనీ.. మునిసిపల్ ఛైర్మన్ మురళీయాదవ్ నొక్కి చెబుతున్నారట. అయితే పార్టీలో గ్రూపు తగాదాలపై సీఎం కేసీఆర్ సహా ముఖ్యులకు సమాచారం ఉన్నా.. నేతల మధ్య సయోధ్యకు చొరవ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. మరి పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో అన్న చర్చ స్థానిక పార్టీ నేతల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version