ఉత్తర్ ప్రదేశ్‌లోని భదోహిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గాదేవి మండపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమ్మవారికి హారతి ఇస్తుండగా ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఐదుగురు దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరారు. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భదోహిలోని దుర్గామాత మండపంలో అమ్మవారికి హారతి ఇస్తుండగా ప్రమాద వశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. మండపం పూర్తిగా కాలిపోయిందని వెల్లడించారు.
అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉంన్నారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.