జగన్ తన కేబినెట్ మంత్రుల్లో ముగ్గురికి చెక్‌పెట్టాలని బావించారా? ఎట్టి పరిస్థితిలోనూ వారిని ఇక, ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు. వాస్తవానికి తన కేబినెట్లో మంత్రులకు జగన్ రెండున్నరేళ్ల డెడ్‌లైన్ విధించారు. రెండున్నరేళ్లలో ఎవరినీ తీసేది లేదని, తర్వాత మాత్రం పూర్తిగా మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. దాదాపు తనతో కలిపి మొత్తం పాతిక మందిని మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు. అయితే,రెండున్నరేళ్లు గడవకముందుగానే.. కొందరు మంత్రులపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఇసుక మాఫియా విషయంలో సదరు మంత్రులు తల దూర్చారని, అదే సమయంలో కొందరు నిర్లిప్తంగా ఉంటున్నారని కూడా జగన్‌కు నిఘా నివేదికలు అందాయి.
ప్రతిపక్షాల ఆరోపణలను సాధారణంగా పరిగణనలోకి తీసుకోని జగన్‌కు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేల నుంచి కూడా కొందరు మంత్రుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు సమావేశం పెట్టినా.. కొందరు మంత్రులపై ఈ తరహా విమర్శలు వస్తుండడంతో జగన్ కూడా అసలు విషయం తెలుసుకునే బాధ్యతలను ఇంటిలిజెన్స్‌కు అప్పగించారు. ఈ క్రమంలో తాజాగా జగన్‌కు కొంత సమాచారం చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగనాథరాజు, అదే జిల్లాకు చెందిన మంత్రి తానేటి వనిత, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప జిల్లాకు చెందిన మైనార్టీ మంత్రి అంజాద్ బాషా, గుంటూరుకు చెందిన మంత్రి సుచరిత, విజయనగరం జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి, చిత్తూరుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వంటివారిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
వీరిలో ముగ్గురు అతి చేస్తున్నారని, మరో నలుగురు అసలు పట్టించుకోవడం లేదనిజగన్‌కు నిఘాల వర్గాల నుంచి సమాచారం ఉందని తెలుస్తోంది. దీంతో పట్టించుకోని వారికి క్లాస్ ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్.. అతి చేస్తున్నవారిలో ఇద్దరికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. పైగా ప్రభుత్వం ఏమైతే.. మాకేంటి ? అనే రేంజ్‌లో వీరు రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ముగ్గురిని త్వరలోనే త ప్పించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే, వీరిలో ఎవరెవరు ఉంటారనే విషయం మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంది. ఏదేమైనా.. ప్రస్తుత ప్రభుత్వానికి మంచి మార్కులు పడాలంటే.. మార్పు తప్పదని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.