దారుణం : వేటగాళ్ల చేతిలో ముగ్గురు పోలీసులు హతం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసులను కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ జిల్లాలో కృష్ణ జింక‌ల వేట‌గాళ్లు ముగ్గురు పోలీసులు కాల్చి చంపారు. గుణ అడ‌వుల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆ రాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఉన్న‌త స్థాయి స‌మావేశానికి పిలుపునిచ్చారు. కూంబింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పై వేట‌గాళ్లు ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా వెల్లడించారు. వేట‌గాళ్ల వ‌ద్ద గ‌న్నులు ఉన్నాయ‌ని, మోటారుబైక్‌పై వ‌చ్చిన ఆ వేట‌గాళ్లు.. పోలీసు టీమ్‌పై కాల్పులు జ‌రిపిన‌ట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Crime Scene Do Not Cross Signage · Free Stock Photo

పోలీసులు ఎదురుదాడి చేసినా.. వేట‌గాళ్లు అక్క‌డ నుంచి పారిపోయారని, ఈ దాడిలో ఎస్సై రాజ్‌కుమార్ జ‌త్వా, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మీనా, కానిస్టేబుల్ నీర‌జ్ భార్గ‌వ్‌లు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీసుల వాహ‌నం న‌డుపుతున్న డ్రైవ‌ర్ కూడా ఈ దాడిలో గాయ‌ప‌డ్డాడు. కృష్ణ జింక‌ల కోసం కొంద‌రు వేట‌గాళ్లు అడ‌వికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం రావ‌డంతో అక్క‌డికి పోలీసులు వెళ్లారు. అట‌వీ ప్రాంతం నుంచి కృష్ణ జింక‌ల శ‌రీరా భాగాల‌ను సేక‌రించారు పోలీసులు.