కరోనా వ్యాక్సిన్‌ అని చెప్పి మందులు అమ్మారు.. అడ్డంగా బుక్కయ్యారు..!

-

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్‌ను కనుగొనలేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఉందని చెప్పి పలు మందులను విక్రయిస్తున్న ముగ్గురు మహిళలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే…

three women arrested in maharashtra for selling fake corona vaccine

మహారాష్ట్రలోని అమ్‌బాద్‌ తాలూకా పిపల్‌గావ్‌ అనే గ్రామంలోని ప్రజలకు రాధా రామ్‌నాథ్‌ సామ్సే, సీమా కృష్ణా అంధాలే, సంగీత రాజేంద్ర అవ్‌హద్‌ అనే ముగ్గురు మహిళలు కరోనా వ్యాక్సిన్‌ అని చెప్పి పలు మందులను అమ్మారు. అంతేకాదు, తాము ప్రభుత్వం తరఫున వచ్చిన హెల్త్‌ కేర్‌ వర్కర్లమని నమ్మబలికారు. అయితే దీనిపై అనుమానం వచ్చిన కొందరు గ్రామస్థులు స్థానిక హెల్త్‌ కేర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు మహిళల కోసం గాలించారు.

కాగా జాల్నా జిల్లాలోని పలు గ్రామాల్లో ఆ ముగ్గురు మహిళలు కరోనా వ్యాక్సిన్‌ అని చెప్పి ఏవో మందులు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళలను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్‌ను ఎవరూ కనిపెట్టలేదని, కనుక ఇలాంటి వారి మాటలు నమ్మి అనవసరంగా మోసపోవద్దని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news